భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రెండేళ్ల పాలనలో కనీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేదు కాబట్టే నోట్ల కట్లతో ఓటర్ల దగ్గరకు వస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం శనివారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ రెండేళ్లలో ప్రజలకు ఏం చేశారని చెప్పి వారిని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితేనని స్పష్టం చేశారు. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం బూతుపితగా మిగిలిపోతారని ఎద్దేవాచేశారు. కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎఎస్, టీబీజీకేఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, కాపు కృష్ణ, నవతన్, రమాకాంత్, బీఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొన్నారు. కాగా, పాల్వంచలోని 27 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు.
గెలుపే లక్ష్యంగా ప్రచారం..
జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాటీల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాయి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండడంతో బీఆర్ఎస్ మాత్రం ఒంటరిగా రంగంలోకి దిగింది. తమ పాలనలో జరిగిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతోంది.