KCR : మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలని ఆరు దశాబ్దాల వయసు పైబడిన ఓ వృద్ధుడు పరితపిస్తున్నాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ రావు పర్యటించారు. గ్రామ వీధి దారిలో స్థానిక నాయకులతో కలిసి కాలినడకన వెళుతున్న తాతా మధుకు ఆ గ్రామానికి చెందిన వాంకుడోత్ బన్సీలాల్ తారసపడి కొద్దిసేపు ముచ్చటించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందని ఆ వృద్ధుడు చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన పనులే ఇంకా గ్రామాలలో కనిపిస్తున్నాయని కాంగ్రెసోళ్లు మాయగా ఎక్కడి నుంచి వచ్చారో ఏమో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నట్టుందని, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశాడు.