రఘునాథపాలెం, అక్టోబర్ 5: ఆయిల్‌ఫెడ్ సంస్థలో జరుగుతున్న అవతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే, రైతు నేత జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో ఆయిల్‌పామ్ రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తంబూరు ఉమామహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగులో రైతులకు సలహాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైన సమయంలో పరిష్కారం మార్గం చూపకపోవడంతో సాగుకు ముందుకురావడం లేదన్నారు. దేశంలో యాబై లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర టన్నుకు రూ.25 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. బహుళ జాతి సంస్థల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వాలు పామాయిల్, పత్తి దిగుమతి సుంకం తగ్గించడం, పూర్తిగా ఎత్తివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు.
రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ రైతులకు సరఫరా చేసే మొక్కలు జన్యుపరమైన లోపంతో గెలలు రాక సుమారు ఏడు సంవత్సరాలు పెంచి తోటలు తొలగించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సంఘం నేతలు తంబూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, బొంతు రాంబాబు మాట్లాడుతూ విదేశాల నుంచి ఆయిల్‌పామ్ మొలకలు దిగుమతి చేస్తున్న ఆయిల్‌ఫెడ్ సంస్థ నర్సరీల్లో పెంచకుండా ప్రైవేటు యాజమాన్యాల నర్సరీల్లో పెంచడం వల్ల హాఫ్టైప్ మొక్కలు వచ్చి రైతులు నష్టాలు చవిచూస్తున్నారన్నారు.
దీనిపై విచారణ చేపట్టి దోషులను తేల్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయిల్‌పామ్ సాగులో కలిగే ఇబ్బందులను సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. అనుకున్నంత స్థాయిలో లాభాలు లేవని, రూ.లక్షల్లో నష్టాలను చవిచూస్తున్నామని ఆవేదన చెందారు. ఈ సదస్సులో రావుజోగిబాబు, చేలికాని వెంకట్రావు, దొడ్డ చక్రధర్‌రెడ్డి, అన్ని జిల్లాలకు చెందిన పామాయిల్ రైతులు పాల్గొన్నారు.