తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రైవేట్‌కు దీటుగా సర్కార్ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నది. బాలికా విద్యకు పెద్దపీట వేయడంతోపాటు వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుకుంటున్న బాలికలకు క్యాష్ అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 15రకాల వస్తువులతో కూడిన హెల్త్ కిట్లను పంపిణీ చేయగా.. కరోనా పరిస్థితుల్లో కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో నిలిపివేసింది. దీన్ని అధిగమించేలా కిట్లకు బదులు విద్యార్థినులకు నెలకు రూ.100 చొప్పున నగదు చెల్లించనున్నది. ఈ నగదును నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనున్నది. విద్యార్థుల బ్యాంక్ ఖాతా వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
– అశ్వారావుపేట, జనవరి 10
అశ్వారావుపేట, జనవరి 10: రాష్ట్ర సర్కార్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పాఠశాలలు, కళాశాలలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్థుల అవసరాలను తీరుస్తున్నది. తాజాగా కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చదువుకుంటున్న బాలికలకు క్యాష్ అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 15రకాల వస్తువులతో కూడిన హెల్త్ కిట్లను పంపిణీ చేసింది. అయితే కరోనా పరిస్థితుల్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీనిని అధిగమించేలా కిట్లకు బదులు విద్యార్థినులకు నగదు చెల్లించనున్నది. ఈ నగదును నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనున్నది. ఇందుకు అవసరమైన విద్యార్థుల బ్యాంక్ ఖాతా వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నెలకు రూ.100 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నగదు అందించనున్నది. జిల్లావ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా 3,555 మంది బాలికలు చదువుకుంటున్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఇప్పటివరకు 15రకాల వస్తువులతో హెల్త్ కిట్లను పంపిణీ చేసింది. ఇప్పుడు కిట్లకు బదులుగా విద్యార్థినులకు నగదు అందించాలని నిర్ణయించింది.
ఒక్కో విద్యార్థినికి నెలకు రూ.100 చొప్పున అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు కేజీబీవీల వారీగా విద్యార్థినుల బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 14 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఒక్క ఆళ్ళపల్లి కేజీబీవీ మినహా మిగతా కేజీబీవీల్లో ఇంటర్మీడియేట్ వరకు విద్య అందుతున్నది. జిల్లాలో మొత్తం 3,555 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 1,300మంది ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీల్లో విద్యార్థినులే ఎక్కువగా చదువుకుంటుండగా ప్రభుత్వం ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి, ఇతర సదుయాలు కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులకు ముందు 15రకాల వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను విద్యార్థినులకు అందించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆరోగ్య కిట్ల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన వస్తువులకు సమకూర్చుకోవడంలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థినుల ఇబ్బందులను తొలిగించడమే కాకుండా కిట్ల పంపిణీలో కరోనా వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగదు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
ఖాతాల్లో నగదు జమ
ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులకు అందించే నగదును నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. బ్యాంక్ ఖాతా లేని విద్యార్థినుల చేత కొత్తగా ఖాతాలను తెరిపిస్తున్నారు. ఇటీవల కస్తూర్బా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు ఉన్న విద్యార్థినుల నుంచి నెంబర్ల సేకరించారు. బ్యాంక్ ఖాతా వివరాలు సేకరణ పూర్తికాగానే నగదు జమ అయ్యేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థినులకు ఆరోగ్య కిట్ల బదులు క్యాష్ చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినుల బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నాం. ఖాతాలు లేని విద్యార్థినుల చేత కొత్తగా ఖాతాలు ప్రారంభిస్తున్నాం. ఖాతా వివరాలు సేకరణ పూర్తి అయిన వెంటనే వారి ఖాతాల్లో నెలకు రూ.100 చొప్పున ప్రభుత్వం నగదు జమ చేస్తున్నది. జిల్లాలో మొత్తం 14 కేజీబీవీలు ఉండగా 3,555 మంది బాలికలు చదువుకుంటున్నారు.
– బీ.కాంతకుమారి, స్పెషల్ ఆఫీసర్, చండ్రుగొండ