ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తుతున్నది.. ‘ఎర్ర బంగారం’తో మార్కెట్ కళకళలాడుతున్నది.. ఉమ్మడి జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్ నుంచి భారీగా బస్తాలు తరలివస్తున్నాయి.. ఏటా జిల్లా వ్యాప్తంగా 50- 55వేల ఎకరాలకే పరిమితమయ్యే సాగు విస్తీర్ణం ఈసారి ఏకంగా 1.10 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ సంవత్సరం తెగుళ్ల తాకిడి బాగా ఉండి దిగుబడులు తగ్గినప్పటికీ చేతికొచ్చిన పంటకు మంచి ధర లభిస్తుండడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.. అంతర్జాతీయ మార్కెట్లో తేజా రకం మిర్చికి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు పోటీపడి పంట కొనుగోలు చేస్తున్నారు.. మరోవైపు క్రయ విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా, మార్కెట్ నుంచి సరుకు తరలింపులో అడ్డంకులు లేకుండా మార్కెట్ కమిటీ, మార్కెటింగ్‌శాఖ అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. రైతులు తీసుకువచ్చిన పంటకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నారు..
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 11: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రైతులు అధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా 50- 55వేల ఎకరాలకే పరిమితమయ్యే మిర్చి సాగు ఈసారి ఏకంగా 1.10 లక్షల ఎకరాల్లో సాగు అయింది. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో మిర్చి బస్తాలు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాక సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన రైతులు మార్కెట్‌కు దిగుబడి తీసుకువస్తున్నారు. నెల రోజుల నుంచి క్రమక్రమంగా క్రయ విక్రయాలు పెరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మిర్చిని ఆరబెట్టుకోవడానికి రైతులకు అవకాశం వచ్చింది. దీంతో నాణ్యమైన మిర్చి మార్కెట్‌కు తరలివస్తున్నది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎగుమతులు ప్రారంభం కావడంతో వ్యాపారులు పంటను పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోల్డ్‌స్టోరేజీల్లో పంటల నిల్వ చేసేందుకు రైతులు ముందుకురావడం లేదు. రోజువారీగా తక్కువలో తక్కువగా మార్కెట్‌కు 30 వేల బస్తాలు వస్తున్నాయి. శుక్రవారం యార్డుకు సుమారు 50 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. జెండాపాటలో ఒక క్వింటాకు గరిష్ఠ ధర రూ.19,650 పలికింది. ఖరీదుదారులు పోటీపడి పంటను కొనుగోలు చేశారు. ఈ సారి తెగుళ్ల కారణంగా దిగుబడులు కొంత మేర తగ్గినప్పటికీ మంచి ధర వస్తుండడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఒకటి. దశాబ్దాల నుంచి పేరెన్నిక గల మార్కెట్ ఇది. మార్కెట్‌కు ఉమ్మడి జిల్లా నుంచే పొరుగు జిల్లాల నుంచి సైతం రైతులు పంటలు తీసుకువస్తారు. ప్రస్తుతం మార్కెట్‌కు మిర్చి, పత్తితో పాటు వేరుశనగ, అపరాల ఉత్పత్తుల తాకిడి పెరిగింది. అప్రమత్తమైన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సెక్రటరీ మల్లేశం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం జెండా పాట మొదలుకొని సాయంత్రం ఉత్పత్తుల క్రయ విక్రయాలు ముగిసే వరకు రైతులు, వ్యాపారులకు అందుబాటులో ఉంటున్నారు. ట్రాఫిక్ సమస్యలకు తావు లేకుండా, కృత్రిమ అల్లర్లకు అవకాశం లేకుండా పోలీస్‌శాఖ సాయం తీసుకుంటున్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.
మిర్చి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి క్రయ విక్రయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులతో కలిసి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నాం. లోటుపాట్లను సరిచేస్తున్నాం. రోజువారీ జెండాపాటను సెక్రటరీ, యార్డు ఇన్చార్జులు పర్యవేక్షిస్తున్నాను. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్‌శాఖ సాయం తీసుకుంటున్నాం.
– డౌలే లక్ష్మీప్రసన్న, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
ఖమ్మం మార్కెట్‌పై ఉన్న నమ్మకంతో జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి రైతులు పంట దిగుబడులు తీసుకువస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరలు ఇస్తున్నాం. జెండాపాటకు అనుగుణంగా నడుచుకుంటున్నాం. ప్రస్తుతం తేజా రకం మిర్చికి మంచి డిమాండ్ ఉన్నది. నాణ్యమైన మిర్చికి మంచి ధర ఇస్తున్నాం. రైతులు సంతోషంగా ఇంటికి వెళుతున్నారు.
-ఆర్.మల్లేశం, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ