– ఖమ్మం రూరల్ తాసీల్దార్కు నాయుడుపేట వాసుల వినతి
ఖమ్మం రూరల్, మే 18 : స్మశాన వాటిక అందుబాటులో లేక నాయుడుపేట వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణం స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఖమ్మం రూరల్ తాసీల్దార్కు నాయుడుపేట కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. సోమవారం రూరల్ తాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసీల్దార్ సంపత్ ను కలిసిన కాలనీవాసులు సమస్యతో కూడిన ప్రతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా స్మశాన వాటిక అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత స్మశాన వాటికలో చెత్త డంపింగ్ చేయడంతో ఇటీవల చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను ఖననం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుండి మున్నేరు రిటర్నింగ్ వాల్ కు అనుబంధంగా రహదారి ఏర్పాటు చేయడంతో పూర్తిగా స్మశాన వాటిక కనుమరుగైపోయిందన్నారు. పాత సమాధులు కూడా లేకపోవడం వల్ల తమ మాతృ, పితృలను గుర్తుచేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కాలనీవాసుల సమస్యను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయంగా స్మశాన వాటిక స్థలం కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కనకయ్య, శీలం రవికుమార్, నందిగామ కృష్ణ, మేకల ఉదయ్, పాపిట్ల సత్యనారాయణ, గొర్రె నవీన్ పాల్గొన్నారు.