పాల్వంచ, ఏప్రిల్ 2 : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరుపేదలు గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత అల్లూరి సెంటర్లోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎండలోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని నవభారత్, గాంధీనగర్‌లో గతంలో నిర్మించిన ఇండ్లను నిరుపేదలకు కేటాయించాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు పలువురు మాట్లాడుతూ నిరుపేదల కోసం నిర్మించిన ఇండ్లను వారికి కేటాయించకుండా తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నిరుపేదలకు ఇండ్లు లేకపోవడంతో అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ.. అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం అర్హులతో కూడిన జాబితాను తహసీల్దార్‌కు అందజేశారు. అర్హులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తులసీరాం, మచ్చ వెంకటేశ్వర్లు, జ్యోతి, దొడ్డ రవికుమార్, సత్య, నిరంజన్, సత్యవాణి, సులోచన, కాంతి, గౌసియా, మాధవి, బాస నారాయణ, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.