మధిర, ఆగస్టు 28 : భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గురువారం చింతకాని మండలం ఖమ్మం- బోనకల్లు ప్రధాన రహదారి రామకృష్ణాపురం వద్ద వరద ప్రవాహాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రాకపోకలు, ప్రజలు బ్రిడ్జి దాటకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అధికారులు పూర్తి సంసిద్ధతతో స్థానికంగా ఉంటూ పని చేయాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే 1077, వాట్సాప్ సెల్ నెంబర్ 9063211298 లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నీటి వనరులు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలోని రోడ్లు, వంతెనలపై రాకపోకలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని, దీనికి సంబంధించి తాసీల్దార్లు, ఎంపిడిఓలు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునేలా అధికారులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఖమ్మం అర్బన్ తాసీల్దార్ సైదులు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, కార్పొరేటర్ మేడరపు వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.