నమస్తే నెట్వర్క్ ;తొమ్మిదేళ్ల సుపరిపాలన.. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ర్టాభివృద్ధి.. సబ్బండవర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికే తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన కృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీసీలపై వరాల జల్లు కురిపించారు. దివ్యాంగులకు అందించే పింఛన్‌ను రూ.4,116కు పెంచి వచ్చే నెల నుంచే అందించనున్నారు. 14 బీసీ కులాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష సాయం ప్రకటించి చెక్కులను అందజేస్తున్నారు. గొల్ల, కురుమలకు రెండోవిడుత గొర్రెల పంపిణీని ప్రారంభించి వారిలో మోముల్లో చిరునవ్వు నిలిపారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. దివ్యాంగులు పెద్దఎత్తున స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నారు.
గత ప్రభుత్వాలు డబ్బు ఏండ్లలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తొమ్మిదేండ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీవినీ ఎరుగని రీతిలో చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది కాలంలోకి అడుగిడిన శుభసందర్భంగా ఊరూరా ప్రజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలపై మరోమారు వరాల జల్లు కురిపించారు. రెండోవిడత గొర్రెల పంపిణీని షురూ చేశారు. బీసీ కులవృత్తులను ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.లక్ష సాయం అందిస్తున్నారు. దివ్యాంగుల పింఛన్‌ను మరో రూ.వెయ్యి పెంచి రూ.4116 ఇవ్వనున్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు కూడా అందిస్తున్నారు. దీంతో సబ్బండవర్గాల ప్రజలు బీఆర్ఎస్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు. సంతోషంతో సీఎం కేసీఆర్‌ను కొనియాడుతున్నారు. శనివారం పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
దివ్యాంగుల ఆత్మైస్థెర్యాన్ని పెంచారు
దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4116 పింఛన్ ఇవ్వడం గొప్ప విషయం. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పేదలకు బాసటగా నిలిచింది. దివ్యాంగులకు గౌరవమైన పింఛన్‌తోపాటు, ఉచిత బస్సుపాస్, స్వయం ఉపాధికి రుణ సౌకర్యం కల్పిస్తూ సీఎం కేసీఆర్ వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపారు. పింఛన్ పెరగడం వల్ల మా కుటుంబానికి మరింత ఆర్థిక ప్రోత్సాహం కలిగింది. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– రాంపండు వెంకన్న, దివ్యాంగుడు, మేడిదపల్లి, తిరుమలాయపాలెం
ప్రోత్సాహం ఇవ్వడం గొప్ప విషయం
చాలామందికి లోన్లు వచ్చేవి కానీ.. బీసీ వాళ్లకు ఉచితంగా లక్ష ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయేదే. అన్నివర్గాలను సమానంగా చూస్తున్నారు. మా స్తోమతను బట్టి షాపు పెట్టుకున్నాం. ఇంకా అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవు. సమయానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఎల్లప్పుడూ సార్‌కు రుణపడి ఉంటాం.
– సీహెచ్ మోహన్. బాలాజీ సెలూన్షాప్. పాల్వంచ,
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
గత 30 సంవత్సరాలుగా ఎన్నో అవస్థలు పడుతున్నా. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పింఛన్ ఇప్పటివరకు రూ.4,116లకు పెంచడం హర్షణీయం. దివ్యాంగులందరూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
– చెలిమల్ల రాజేందర్, సెక్రటరీ, జాతీయ వికలాంగుల వేదిక హక్కుల సంఘం, ఇల్లెందు రూరల్
సీఎం కేసీఆర్ లేకపోతే మాకు దిక్కులేదు ; దివ్యాంగురాలి తల్లి సుగుణమ్మ మనోగతం
ఖమ్మం రూరల్, జూన్ 10 : పింఛన్ డబ్బులతోనే పదేండ్ల సంది నా బిడ్డ బతుకుతున్నది. మూడేళ్ల నుంచి నాకు కూడా పింఛన్ వస్తుండడంతో ఆ డబ్బులతోనే ప్రాణాలతో ఉంటున్నాం. మాది ఖమ్మంరూరల్ మండలం గుర్రాలపాడు గ్రామం. నా భర్త మూడేళ్ల కిందట ఆర్యోగం బాగాలేక చనిపోయాడు. మాకు ముగ్గరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. పెద్ద బిడ్డ తరుపతమ్మకు చిన్నప్పటి నుంచి పోలియో ఉంది. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు అయ్యాయి, వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. రెండో బిడ్డను చింతకాని మండలంలో సంబంధం ఇచ్చాం. అందరూ విడిపోయి ఎవరికి వాళ్లు కుటుంబంతో బతుకుతున్నారు. నేను, నా పెద్ద బిడ్డ ఇద్దరం మా ఉర్లో ఉన్న చిన్నరేకుల ఇంట్లో ఉంటున్నాం. నాకు ఇప్పుడు 75 ఏండ్లు. ఏమీ పనిచేయలేను. నా పరిస్థితి ఇట్లా ఉంటే పుట్టకతోనే పోలియోతో బాధపడుతున్న బిడ్డ నా వద్దనే ఉంటది. ఆమెకు నడవడం కూడా రాదు. దీంతో కేసీఆర్ నాకు రూ.2 వేల వింతంతు పింఛన్ ఇస్తుండు. దివ్యాంగురాలైన నా బిడ్డకు రూ.3 వేలు వస్తున్నాయి. ఈ ఐదు వేలతో సంవత్సరాలుగా జీవితం గడుపుతున్నాం. నా బిడ్డకు రూ.వెయ్యి పెంచడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటోళ్లకు సీఎం కేసీఆర్ దేవుడు. ఆయన లేకపోతే మాకు జీవితమే లేదు.
కేసీఆర్ సాయం మరువలేం…
కులవృత్తిదారులకు అందిస్తున్న సీఎం కేసీఆర్ సాయాన్ని ఎన్నటికీ మరువలేము. రూ.లక్ష చెక్కును ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్ చేతులమీదుగా అందుకున్నాను. గతంలో ఏ ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ బీసీలకు ఎన్నో పథకాలు అమలుచేస్తూనే కులవృత్తులను ప్రోత్సహించేందుకు రూ.లక్ష సాయం అందించడం ఆనందంగా ఉంది. సర్కారు సాయంతో మా ఉపాధిని మెరుగుపర్చుకుంటాం. నాకు ఇద్దరు కుమార్తెలు. చదువుకుంటున్నారు. ఇస్త్రీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా కుటుంబానికి ఆర్థి భరోసా కలిగింది.
–కృష్ణవేణి, గాంధీనగర్, సారపాక, బూర్గంపహాడ్ మండలం
పింఛనే మా కుటుంబానికి జీవనాధారం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛనే మా కుటుంబానికి ఆధారం. నాకు పుట్టుకతోనే పోలియో రావడం వల్ల నడువలేను. ఒకప్పుడు కేవలం రూ.500 మాత్రమే పింఛన్ వచ్చేది. సీఎం కేసీఆర్ దానిని రూ.2 వేలకు పెంచారు. మరలా రూ.3 వేలు చేశారు. ప్రస్తుతం రూ.4,116గా పెంచుతున్నట్లు ప్రకటించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను ఉంటాం. మా నాన్నకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016 వస్తున్నది. ఎటువంటి పనులు చేసుకోలేని నాలాంటి వాళ్లకు ఈ పెన్షన్ ధైర్యాన్నిచ్చింది. నేను పీజీ వరకు చదువుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నాకు ఉచితంగా మోటర్‌సైకిల్‌ను కూడా ఇచ్చింది.
– కొండా రామారావు, ముష్టికుంట్ల, బోనకల్లు
కేసీఆర్ సార్ పాలన మంచిగ చేస్తున్నరు..
కేసీఆర్ సార్ రాష్ర్టాన్ని మంచిగ పరిపాలిస్తున్నారు. అందరికీ అన్నీ ఇస్తూ కుటుంబాలకు పెద్దదిక్కయ్యారు. దివ్యాంగుల పింఛన్ పైన మా కుటుంబం ఆధారపడుతున్నది. నా భర్త వెల్డింగ్ కూలిపనికి వెళ్తున్నాడు. ఇప్పుడు సీఎం కేసీఆర్ రూ.4,116 పింఛన్ ఇస్తూ మా కుటుంబంలో పాలుపోశారు. ఆయన పాలన మంచిగ సాగుతున్నది. సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. డిగ్రీ చదివిన నాకు ఉద్యోగం చేయాలని ఉంది.
– కోటోజు నాగలక్ష్మి, దివ్యాంగురాలు, అశ్వారావుపేట టౌన్
కేసీఆరే మళ్లీ సీఎం కావాలి
పుట్టుకతోనే మూగ, చెవిటివాడిగా ఉన్న రాజేందర్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.3,016 దివ్యాంగుడి పింఛన్ తీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు మరో వెయ్యి పెంచి రూ.4,116 అందిస్తానని ప్రకటించగా కుటుంబ సభ్యులు రాజేందర్‌కు సైగల ద్వారా తెలిపారు. దీంతో పేపర్లోని ముఖ్యమంత్రి ఫొటో చూసి తన సంతోషాన్ని సైగల ద్వారా వ్యక్తం చేశాడు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, బీఆర్ఎస్ పార్టీకే మళ్లీ ఓటేస్తానని తన హావభావాల ద్వారా వ్యక్తపరిచిన తీరు అందరినీ ఆకట్టుకున్నది.
– ఉపాధ్యాయుల రాజేంద్ర, దివ్యాంగుడు, అశ్వారావుపేట టౌన్
దివ్యాంగులకు పెద్దదిక్కు కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దివ్యాంగులకు రూ.500 పింఛన్‌గా ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దివ్యాంగులకు మూడుసార్లు పింఛన్ పెంచి పెద్దదిక్కుగా నిలిచారు. దివ్యాంగులు ఎంతో సంతోషంగా ఉన్నారు. దివ్యాంగుల పట్ల సీఎంకు ఎంతో ప్రేమ ఉంది.. అందుకే అడుగకుండానే పింఛన్ పెంచారు. దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక పరికరాలను కూడా అందిస్తూ అండగా నిలిచారు. సీఎం కేసీఆర్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.
– పీవీ చలమయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ దివ్యాంగుల జేఏసీ, నేలకొండపల్లి
కేసీఆర్ సార్ చల్లగుండాలి
నేను 2005 నుంచి దివ్యాంగుల పింఛన్ పొందుతున్నాను. అప్పట్లో రూ.500 ఇచ్చేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రూ. 1500లకు పెంచారు. తిరిగి రూ.3016 లకు పెంచి దివ్యాంగుల కుటుంబాలను ఆదుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరోసారి పెంచి రూ.4116లు పింఛన్ అందిస్తానని ప్రకటించడం హర్షణీయం. నాలాంటి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడు కేసీఆర్. ఏ పని చేయలేకున్నా మా కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించి ఆదుకుంటున్న గొప్ప సీఎం కేసీఆర్. ఆయన చల్లగుండాలి.
– షేక్ బీబీ, దివ్యాంగురాలు, పాకలగూడెం, సత్తుపల్లి
కేసీఆర్ సార్ దేవుడు
గత ప్రభుత్వంలో దివ్యాంగులకు చాలీచాలని పింఛన్ ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.500 నుంచి రూ.1500, రూ.3016 పెంచుతూ దివ్యాంగులకు ఆర్థిక చేయూత అందించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రూ.1000 పెంచుతూ వచ్చే నెల నుంచి రూ.4116 అమలుచేస్తున్నట్లు చెప్పడం దివ్యాంగులకు శుభపరిణామం. తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ఉన్నారంటే దానికి సీఎం కేసీఆరే కారణం. కేసీఆర్ మాకు దేవుడు. ఆయన రుణం తీర్చుకోలేనిది.
-పొడుతూరి రమేశ్, దివ్యాంగుడు, దుమ్ముగూడెం
దివ్యాంగుల్లో సంతోషం నిండింది
మా ఇబ్బందులను గుర్తించి పింఛన్ పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దివ్యాంగుల్లో సంతోషం నిండింది. పెరుగుతున్న నిత్యావసరాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ను వెయ్యి పెంచడం హర్షణీయం. మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– తేళ్ళ ప్రవీణ్, అధ్యక్షుడు, జాతీయ వికలాంగుల వేదిక హక్కుల సంఘం, ఇల్లెందు రూరల్