కొత్తగూడెం సింగరేణి, జూన్ 20 : సింగరేణి సంస్థలో సివిల్ అధికారులు అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్టు కార్మికులను నియమించడంపై ఆగ్రహిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రీజినల్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, కిష్టఫర్ మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మధ్య ఘర్షణ సృష్టిస్తున్న సివిల్ అధికారులు దొడ్డిదారిన పోటీ కార్మికులను తీసుకురావడం సరికాదని, బంగ్లోస్ వద్ద జరిగే పరిణామాలకు సివిల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బంగ్లోస్ వద్ద జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు సివిల్ అధికారులే బాధ్యులని, వారు తప్పుడు పద్ధతిలో టెండర్లు పిలవడం వల్ల రైటర్ బస్తీ, బంగ్లోస్ కాంట్రాక్టు కార్మికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై తక్షణమే తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పోటీ కార్మికులను అడ్డుకొని శుక్రవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో రంజిత్, కృష్ణమూర్తి, రాజు, శంకర్, నాగమ్మ, సురేశ్, ఆదిలక్ష్మి, సుశీల, విజయ్, సుజాత, మాధవి, కల్యాణి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.