కొత్తగూడెం సింగరేణి, జూన్ 11 : మితిమీరిన రాజకీయ జోక్యం వల్లే సింగరేణి సంస్థలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, ప్రచార కార్యదర్శి వీరస్వామి ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రభుత్వం కూడా ఒక కారణమని వారు ధ్వజమెత్తారు.
కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పు, పెర్క్స్‌పై ఇన్‌కం ట్యాక్స్ తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
ప్రత్యేకంగా మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా.. అది కూడా రాజకీయ జోక్యంతోనే ఆగిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు మల్లికార్జున్‌రావు, ఎస్వీ రమణమూర్తి, క్రిస్టోఫర్, గట్టయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.