ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 23 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆయా కలెక్టరేట్ల ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తొలుత ఖమ్మం నుంచి వేలాది మంది విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శనగా వచ్చిన సంఘం నాయకులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరగడంతోపాటు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ ఫహీం మాట్లాడారు. విద్యార్థులపై వివక్ష చూపిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, నాన్ ప్రొఫెషనల్ రూ.2 వేల కోట్లు, ప్రొఫెషనల్ రూ.4 వేల కోట్ల ఉపకార వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు నాగులమీరా, మధు, శివనాయక్, మనోజ్, రాకేశ్, ప్రతాప్, రోహిత్, గోపి, సాయి, నరేశ్, అయ్యప్ప, అజిత్, షాహీద్, వంశీ, పవన్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.