ఖమ్మం కమాన్‌బజార్, జూలై 6: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర వీధుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థి లోకం కదం తొక్కింది. పురవీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తూ కేయూ అనుబంధ పీజీ కళాశాల నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతోపాటు ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారంతా అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల బోధనా రుసుము, ఉపకార వేతనాల విడుదలలో వివక్ష చూపించిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు కోట్లల్లో పెండింగ్ ఉన్నాయని, దీనిపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పలుమార్లు నిరవధిక బంద్‌లు నిర్వహించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందని లేదని ఆయన విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎకువ శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్నారని, వారు చదివే ఇంజినీరింగ్ కళాశాలలకు పూర్తి రీయింబర్స్మెంట్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కో డిగ్రీ విద్యార్థికి సుమారు రూ.18వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. మొత్తం రూ.10,300 కోట్లు పెండింగ్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు షేక్ నాగుల్ మీరా, మనోజ్, జిల్లా నాయకులు పవన్, మనోజ్, సుకుమార్, ఉస్మాన్, ఉపేందర్, గోపి, వెంకట్, నవీన్, చైతన్య పాల్గొన్నారు.