ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి సాగు చేసిన రైతులు భారీ నష్టాల బారిన పడాల్సి వచ్చిందన్నారు. తామరపురుగు తెగులు కారణంగా దిగుబడులు సైతం వచ్చే అవకాశం లేదన్నారు.
సాగు రైతులు సమస్యలను పరిగణలోకి తీసుకొని అడ్తీ వ్యాపారులు ఈ సంవత్సరం రైతులు తీసుకున్న అప్పులకు వడ్డీలు రద్దు చేయడంతో పాటు, వసూళ్లు మరో సంవత్సరం వాయిదా వేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఆమె కమిషన్ వ్యాపారులు, రైతుసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుర్రం అచ్చయ్య, మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, బందెల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.