ఖమ్మం, నవంబర్ 13: రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వీ.కోటేశ్వరరావు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తొలుత కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను, రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
అయినప్పటికీ వారిని దాటుకొని వెళ్లి కలెక్టరేట్లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ వానకాలం సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల వరి, పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన ఖమ్మం జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలు, వరదలు, తుపాన్ల వల్ల జిల్లాలో పంటలు మొత్తం దిబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతులను ఆదుకోలేకపోయారని, సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నేతలు ఆవునూరి మధు, రాజేంద్రప్రసాద్, బజ్జురి వెంకట్రామిరెడ్డి, ప్రకాష్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, నవంబర్ 13: అనుమతి లేకుండా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ధర్నా చేసిన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన, వచ్చి పోయే ప్రజలకు, వాహనదారులకు అంతరాయం కలిగించిన వ్యక్తులపై రఘునాథపాలెం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
సీఐ ఉస్మాన్ షరీఫ్ కథనం ప్రకారం.. ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్ సంఘాల కార్యకర్తలైన షేక్ సుభాన్, గొర్రెపాటి రమేశ్, ఆవునూరి మధు, బజ్జూరి వెంకటరామిరెడ్డి, ఏనుగుల ప్రకాశ్, కోలా లక్ష్మీనారాయణ సహా మరికొంతమంది అక్రమ సంఘంగా ఏర్పాటయ్యారు. అధికారుల అనుమతి లేకుండా ఖమ్మం కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. నిరసన పేరుతో న్యూసెన్స్ చేశారు. అడ్డుకోబోయిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ధర్నా చేయాలంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాలని, అది కూడా ధర్నాచౌక్లోనే చేసుకోవాలని సూచించారు. లేకుంటే కేసులకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.