మామిళ్లగూడెం, జనవరి 3: పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్‌దత్ హెచ్చరించారు. రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో కోడి పందేలను నివారించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా శుక్రవారం పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కోడి పందేలను నియంత్రించేందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోడి పందేలు, జూదం నిర్వహించేందుకు తోటలు, ఖాళీ భూములు, అతిథి గృహాలు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బెట్టింగ్, పేకాట శిబిరాలపై సైతం దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు.
మనుషులు, పక్షులు, జంతువులకు హాని కలిగించే చైనా మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. దీనిపై ఎస్‌హెచ్‌వోలు ప్రత్యేకంగా దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాంజా అమ్మకాలు, వినియోగంపై పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.