Ashwini | కారేపల్లి: తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని విగ్రహాన్ని ఆమె స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాలో ఏర్పాటు చేశారు. అశ్వినితో పాటు ఆయన తండ్రి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటిని అశ్విని తల్లి నేజి, సోదరుడు అశోక్ కుమార్‌లు ఆదివారం నాడు ఆవిష్కరించారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కారుతో సహా ఆకేరు వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ మేనేజ్మెంట్లో జరగనున్న సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆ తండ్రీకూతుళ్ల స్మారకార్థం గ్రామస్తులు, కుటుంబసభ్యులు కలిసి వారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
కాగా, అనతి కాలంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విని పేరు చిరస్థాయిగా గుర్తుండేలా గతంలో ఆమె పరిశోధన చేసిన పూస శనగ 4037 రకం వంగడానికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) ఆమె పేరునే పెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐసీఏఆర్ ఒక ప్రకటన చేసింది. ఈ రకం హెక్టార్‌కు 26.73 క్వింటాళ్ల నుంచి 36.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని పేర్కొంది.