అశ్వారావుపేట, అక్టోబర్ 12 : రైతులు సాగు చేస్తున్న పంటల లెక్క తప్పుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది పక్కాగా చేపట్టాల్సిన పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియపై వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం సీజన్ పూర్తికావొస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా క్రాప్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు నిదర్శనం. మొత్తం 45రోజుల్లో పూర్తికావాల్సిన ప్రక్రియను ఇప్పటివరకు 53శాతమే పూర్తిచేయగా ఇంకా పదిహేను రోజుల్లో 57శాతాన్ని పూర్తిచేయాల్సి ఉంది.
దీంతో క్షేత్రస్థాయికి వెళ్లకుండానే గతేడాది లెక్కల ఆధారంగా వ్యవసాయశాఖ అధికారులు మమ అనిపిస్తారనే ఆరోపణలు రైతులు, రైతు సంఘాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. కాకిలెక్కలతో పంటల నమోదును అధికారులు పూర్తి చేస్తుండడంతో ప్రభుత్వ అంచనాలు తారుమారు అవుతున్నాయి. తద్వార రైతులకు అందాల్సిన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందడం లేదు. పంటల కొనుగోళ్ల విషయంలో సైతం అన్నదాతలు తీవ్ర అవస్థలు ఎదుర్కోకతప్పడం లేదు.
ప్రతి సంవత్సరం పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, మద్దతు ధర, కొనుగోళ్ల అంచనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యవసాయ సీజన్లో పంటల నమోదు ప్రక్రియ చేపడుతుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవోలు) క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నమోదు చేస్తారు. శాస్త్రీయ పద్ధతిలో జియో ట్యాపింగ్ ద్వారా పంటల నమోదు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ఒక ప్రకటన సైతం చేసింది.. కానీ ఆ దిశగా ప్రయత్నం మాత్రం జరగటం లేదు. పంటలకు ఆశించే తెగుళ్ళు, వాటి నివారణపై రైతులకు అవగాహన కల్పించటానికి క్రాప్ బుకింగ్ ఆధారం.
రైతులు పంటలు వేసినప్పుడు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారన్న వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తే కచ్చితమైన పంటల వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. తదనుగుణంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ, మద్దతు ధరకు పంటల కొనుగోళ్లు, అందుకయ్యే ఖర్చుల కోసం నిధులు సమకూర్చుకోవటానికి వీలుంటుంది. కానీ ఈ సీజన్లో పంటల నమోదు కాకిలెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలు పంటల సేకరణ వరకు అంతా లోపబూయిష్టంగానే సాగుతున్నదనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నది. వానకాలం సీజన్ చివరకు వచ్చినప్పటికీ క్రాప్ బుకింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నిరకాల పంటలు 5,08,604 ఎకరాల్లో వేసినట్లు జిల్లా నోడల్ ఆఫీసర్ (డీఎన్ఓ) నివేదిక చెబుతున్నది. ఇందులో అధికారిక లెక్క ప్రకారం ఈ నెల 7వ తేదీ నాటికి 2,69,874 ఎకరాల్లో(53 శాతం) పంటల నమోదు మాత్రమే పూర్తి అయ్యింది. ఇంకా 2,38,725 ఎకరాల్లో పంటలు నమోదు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ప్రతి సీజన్‌కు 60రోజులు గడువు ఇచ్చే ప్రభుత్వం ఈసారి ఆలస్యంగా పంటల నమోదు ప్రక్రియ చేపట్టి కేవలం 45రోజుల గడువు ఇచ్చింది. ఈ లెక్కన గడిచిన నెలరోజులుగా కేవలం 53శాతం మాత్రమే నమోదు చేసిన వ్యవసాయ శాఖాధికారులు మిగతా పక్షంరోజుల్లో 57శాతం ఎలా సాధ్యమనేది ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవంగా ప్రతి ఏఈవో తన పరిధిలో 40శాతం పంటలను క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ బుకింగ్ చేయాలి. మిగతా 60శాతం జనరల్ క్రాప్ బుకింగ్ చేసే వెసులుబాటు ఉంది.
పంటల నమోదు ప్రక్రియను వ్యవసాయాధికారులు గతేడాది లెక్కల ఆధారంగా మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రక్రియ ప్రారంభంలో క్షేత్రస్థాయికి వెళ్లి తర్వాత సొంత అంచనాలతో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులు సాగు చేస్తున్న ఆయా పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే ఏ గ్రామంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో ప్రభుత్వం వద్ద పటిష్ట సమాచారం ఉంటుంది.
దీనికి అనుగుణంగా వచ్చే సీజన్‌కు విత్తనాలు, ఎరువులు, పంట కొనుగోళ్ళకు ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా ఉంటుంది. కానీ అలా జరగటం లేదు. మండలస్థాయి అధికారులకు ఇతర పనులను అప్పగించటం వల్ల అసలు పంట నమోదు చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 100 మంది ఏఈవోలు అవసరం ఉండగా ప్రస్తుతం 67మందే పని చేస్తున్నట్లు సమాచారం. పనిభారం ఎక్కువగా ఉండటంతో పంటల నమోదును కొంచెం అటూ, ఇటూగా పూర్తిచేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
ఈ ఏడాది పంటల నమోదు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. సర్వర్, డాటా తీసుకోవడంలో వచ్చే ఇబ్బందులతో పంటల నమోదుకు సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తాం. ఏఈవోలు కేటాయించిన ప్రాంతాల్లో డిజిటల్, నాన్ డిజిటల్ పద్ధతిలో పంటల నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నారు.
– పి.రవికుమార్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు, అశ్వారావుపేట