ఖమ్మం రూరల్, అక్టోబర్ 9 : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ దుస్థితి. భౌగోళికంగా రైతులకు అనుగుణంగా, జాతీయ రహదారుల కూడలిగా, కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు, జిన్నింగ్ మిల్లులు ఇలా అనేక రకాల వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆది నుంచి మార్కెట్ ఏర్పాటుకు ఏదో రూపంలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2018లో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయింది. ఖమ్మం మార్కెట్లోని ఉద్యోగుల విభజనతోపాటు నిల్వ ఉన్న ఆదాయం సైతం విభజన జరిగింది. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాలతోపాటు కూసుమంచి పరిధిలోని కొన్ని గ్రామాలను మద్దులపల్లి మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆరేండ్ల క్రితమే మద్దులపల్లి రెవెన్యూ పరిధిలో ఎన్నెస్పీ కాల్వ పక్కన సుమారు 24 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం 2022లో నాటి సర్కార్ మార్కెట్ నిర్మాణం నిమిత్తం రూ.19 కోట్ల నిధులను మంజూరు చేయడంతో కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. దీంతో ఏడాదిలోపే నూతన మార్కెట్ అందుబాటులోకి వస్తుందని రైతులు ఆశపడ్డారు. అయితే ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఏమి జరిగిందో తెలియదు కానీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. దీంతో దాదాపు ఏడాదిగా పిల్లర్లు, అసంపూర్తి నిర్మాణాలు మాత్రమే అక్కడ దర్శనమిస్తున్నాయి.
మద్దులపల్లి మార్కెట్‌కు భవన నిర్మాణాలు లేకపోయినప్పటికీ ప్రత్యామ్నాయ వనరుల ద్వారా మంచి ఆదాయం సాధిస్తుండడం విశేషం. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను కొన్నేళ్లుగా ఛేదిస్తూ వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్ పరిధిలో ఉన్న ఒకే ఒక చెక్‌పోస్టు, జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల దగ్గర జరిగే క్రయవిక్రయాలు, ప్రైవేట్ ఖరీదుదారుల ద్వారా వచ్చే సెస్ తదితర వనరుల ద్వారా ఆదాయం వస్తున్నది. యార్డులో క్రయవిక్రయాలు లేకపోయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టి రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించింది.
మార్కెట్ ఆదాయానికి అనుగుణంగా మద్దులపల్లి మార్కెట్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ హోదా ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్ ఏర్పడి ఆరేండ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఏ హోదా దక్కకపోవడం గమనార్హం. అయితే గతంలో సూపర్వైజర్ స్థాయి అధికారి మాత్రమే ఇన్చార్జిగా ఉన్నారు. తర్వాత సెక్రటరీ నియమితులయ్యారు. ప్రస్తుతం సదరు అధికారి అసిస్టెంట్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి పొందారు. ఏదేమైనా సుమారు ఏటా రూ.2 కోట్ల టర్నోవర్ కలిగిన మార్కెట్‌కు రావాల్సిన హోదా నేటికీ దక్కలేదనే చెప్పాలి.
సాధారణంగా మార్కెట్ క్రయవిక్రయాల్లో ఎక్కువ మొత్తం ఆదాయం మిర్చి పంట లావాదేవీల ద్వారానే సమకూరుతుంది. ప్రధానంగా అన్ని పంట ఉత్పత్తుల కంటే మిర్చి పంటకు భారీ ధర ఉండడమే కారణం. టర్నోవర్‌లో వందకు ఒక్క శాతం మార్కెట్‌కు ఖరీదుదారులు సెస్ చెల్లిస్తారు. అయితే మార్కెట్ పరిధిలో జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు ఉంటే వాటి ఆదాయం అదే మార్కెట్ ఖజానాకు చేరాల్సి ఉంటుంది. కానీ.. అందుకు విరుద్ధంగా ఆరేళ్ల నుంచి ఖరీదుదారులు ఖమ్మం ఏఎంసీలోనే సెస్ కడుతున్నారు. ప్రస్తుతం మద్దులపల్లి మార్కెట్ పరిధిలో ఏడు కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి.
వీటి నిల్వ సామర్థ్యం దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల బస్తాలు ఉంటుంది. ఏటా కోల్డ్ స్టోరేజీల వద్ద జరిగే టర్నోవర్ ద్వారానే మార్కెట్‌కు ఇంచుమించు రూ.2 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే మద్దులపల్లి మార్కెట్‌కు కనీసం ప్ల్లాట్‌ఫాం సైతం లేకపోవడంతో మిర్చి బస్తాల శాంపిళ్లను ఖమ్మం మార్కెట్‌కు రైతులు తీసుకెళ్తున్నారు. దీంతో మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజీల పర్యవేక్షణ సైతం ఖమ్మం ఏఎంసీ అధికారుల చూస్తుండడంతో ఆటోమెటిక్‌గా ఆదాయం ఖమ్మం ఏఎంసీ ఖజానాకు వెళ్తున్నది. దీంతో ఏటా సుమారు రూ.2 కోట్ల ఆదాయం మద్దులపల్లి మార్కెట్ నష్టపోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ రెండో పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 10వ తేదీ గురువారం జరుగనున్నది. సాయంత్రం 4 గంటలకు మార్కెట్ ఆవరణలో నూతన చైర్మన్ బైరు హరినాథబాబు ఆధ్వర్యంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ కార్యక్రమం వేదికగా మద్దులపల్లి మార్కెట్‌కు సంబంధించిన మార్కెట్ నిర్మాణం, హోదా తదితర సమస్యలకు మంత్రులు శాశ్వత పరిష్కారం చూపుతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.