కమాన్బజార్, జూన్ 24: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీహెచ్ సీతామహాలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు నరసింహారావు, సీతామహాలక్ష్మి మాట్లాడుతూ.. జీవో నెంబర్ 10 రద్దు కోసం గత ఏడాది 24 రోజులపాటు అంగన్వాడీలు సమ్మె చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో సెప్టెంబర్ 11న కాంగ్రెస్ నాయకులు తమ సమ్మె శిబిరం వద్దకు వచ్చారని, తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారని గుర్తుచేశారు. కానీ వారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇంకా ఆ హామీల మాట ఎత్తడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలనూ అంగన్వాడీలకు అమలుచేయాలని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సంఘం నాయకులు.విజయకుమారి, హస్నాబీ, సునీత, శ్రీదేవి, మరియమ్మ, శివరంజని తదితరులు పాల్గొన్నారు.