భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా, భూమి చుక్కాలి పేరు మీద ఉండటంతో రైతు బీమా మంజూరు కోసం నాగవ్య ఏఈవో మణికంఠాన్ని కలిశాడు. బీమా మంజూరు కోసం ఏఈవో రూ. 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.
కాగా, 15 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బుధవారం పాపకొల్లు రైతు వేదికలో ఏఈవో డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏఈవోను ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.