కూసుమంచి, జూన్ 6 : రైతులు వ్యవసాయంతోపాటు చేపల పెంపకం చేపడితే అదనపు ఆదాయం పొందవచ్చని మత్స్య శాఖ మాజీ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. పాలేరులోని పీవీ నర్సింహారావు పశు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మూడు రోజులపాటు మత్స్య రైతులకు ఇచ్చిన శిక్షణ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్స్య రైతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ, రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చేపల పెంపకంపై రైతులు మక్కువ చూపుతున్నారని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రైతులకు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఇచ్చే శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ ఆచరణలో పెట్టి అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గణేశ్, శ్యాంప్రసాద్, రవీందర్, దివ్య తదితరులు పాల్గొన్నారు.