భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : వివిధ సమస్యలపై బాధితులు ఇచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే మూకమామిడి పామాయిల్ సీడ్ ప్రొడ్యూసర్ కంపెనీ వారు తమ సంస్థలో 612 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, మూడేళ్లుగా వారికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తక్కువ ధరకు విక్రయిస్తూ సేవలు అందిస్తున్నామని, తమ సంస్థకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా.. దానిని పరిశీలించి పౌరసరఫరాల శాఖకు ఎండార్స్ చేశారు. అశ్వాపురం మండలం రామవరం గ్రామానికి చెందిన గొగ్గల భద్రమ్మ తన భర్త గాదెయ్య 2021లో మరణించాడని, అనేకసార్లు వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, తనకు పెన్షన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.