ఖమ్మం, జూన్ 27 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సమస్య రాకుండా మండలాల వారీగా ఎకడి నుంచి ఇసుక తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించి ఇసుక రీచ్‌లను కేటాయించిందన్నారు.
మండలాల్లో ఎకడైనా ఇసుక తరలించే పాయింట్ అందుబాటులో ఉంటే ఆ వివరాలను తహసీల్దార్‌కు అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. తహసీల్దార్ కూపన్ జారీ చేస్తారని, ఆ కూపన్‌తో 3రోజుల్లో సంబంధిత ఇసుక రీచ్ నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంటాయని, స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నామని, ప్రతి ట్రాక్టర్ లోడ్ ఇసుకకు రూ.200 తహసీల్దార్ కార్యాలయం వద్ద చెల్లించాల్సి ఉంటుందన్నారు.
విపత్తు నిర్వహణ కోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అన్నారు. టార్చ్‌లైట్, లైఫ్‌జాకెట్, స్పీకర్ మైక్సెట్స్, బోట్లు, జిప్ కవర్, గజ ఈతగాళ్ళకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో పరిశీలించాలని అన్నారు. ప్రతి 15రోజులకు ఒకసారి మండల స్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆపదమిత్ర, గజ ఈతగాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో 24 మంది సభ్యులతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలను స్టేషన్ చేసి పెట్టామన్నారు. సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా మైనింగ్ అధికారి సాయినాథ్, ఆర్డీవోలు నరసింహారావు, ఎల్.రాజేందర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌజింగ్ ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.