కూసుమంచి(నేలకొండపల్లి), మే 16 : కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి నెలపదిహేను రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం తహసీల్దార్, ఏవో కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. నెలపదిహేను రోజులుగా ధాన్యాన్ని కాపాడుకుంటున్న అన్నదాతలు శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఓపిక నశించి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు.
ప్రభుత్వం అందించే బోనస్ రూ.500 చొప్పున వస్తుందనే ఆశతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. కానీ.. మిల్లర్లు 1638 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అంతేకాక ధాన్యం కాంటా వేయడానికి గన్నీ బ్యాగులు లేకపోవడం, కాంటా వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడం, ఇంకా 15 లారీలకు పైగా ధాన్యం కాంటా పెట్టాల్సి ఉండడం..
ఈలోగా శుక్రవారం వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సుమారు 50 మంది ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి రైతులతో ఫోన్లో మాట్లాడారు. గన్నీ బ్యాగులు వెంటనే పంపించి కాంటా వేయిస్తామని, 1638 రకం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరిగిందని, ఆ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
నెలపదిహేను రోజులుగా ఎదురుచూస్తున్నా..
నాకు 500 టిక్కీల ధాన్యం పండింది. అమ్ముకునేందుకు నెలపదిహేను రోజుల కిందట కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. తేమశాతం సరిగానే వచ్చింది అయినా రేపు.. మాపు అంటూ కాంటాలు వేయడం లేదు. అకాల వానలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతిరోజు కాపలాకాయాల్సి వస్తున్నది. ఇకనైనా ధాన్యం కొంటే బాగుండు.
– జోగుపర్తి వెంకటనారాయణ, రైతు, అనాసాగరం
రైతులందరం నిరసన తెలిపాం..
ధాన్యం అమ్ముకోవాలని సుమారు 45రోజులుగా ఎదురుచూస్తున్నాం. 1638 రకం మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. వర్షాలు పడుతుండడంతో ఇంకా ఓపిక పట్టలేక తహసీల్దార్, వ్వయసాయశాఖ కార్యాలయాల వద్దకు వెళ్లి రైతులందరం నిరసన తెలిపాం. అదనపు కలెక్టర్ సారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాం. అనాసాగరంలో ఎక్కువ మంది 1638 రకమే వేశారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
– పాపిని వెంకటనారాయణ, రైతు, అనాసాగరం