ఖమ్మం, ఫిబ్రవరి 24: రాబోయే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని సూచించారు.
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటుచేసిన సమీక్షలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 72, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 97 చొప్పున పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.
టెన్త్ పరీక్షలకు సంబంధించి మార్చి 6న ఒక సెట్,10న రెండో సెట్ ప్రశ్నపత్రాలు జిల్లాకు వస్తాయన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారిశుధ్యం, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సహా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు రవిబాబు, సోమశేఖరశర్మ, ఆశాలత, సురేందర్, డాక్టర్ కళావతీబాయి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.