ఖమ్మం, జూలై 14 : ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిషరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సింగరేణి మండలం గుడితండా గ్రామానికి చెందిన కొత్తూరి వీరమ్మ తనకు స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నది.
ఖమ్మం నగరం జెడ్పీ కాలనీకి చెందిన సరికొండ జానకీరామరాజు తమ ఇంటినెంబర్పై వేరే వారి పేరు వస్తున్నదని, తమ ఇంటి నెంబర్పైన తమ పేరు వచ్చేవిధంగా చూడాలని కోరారు. సింగరేణి మండలం చీమలపాడు గ్రామానికి చెందిన పాటి అనంతరాములు సర్వే నెంబర్ 154/2 నందు గల భూమి పూర్తి సర్వే చేసి తన పేరు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకుంది.
ఖమ్మం నగరం వైఎస్సార్ కాలనీకి చెందిన బి.ప్రవళిక డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నది. మధిర మండలం సిరిపురం గ్రామ ఎస్సీకాలనీ వాసులు శ్మశానవాటిక ఆక్రమణకు గురైందని, ఇకడ అక్రమంగా రేకులషెడ్డు వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వోఏ పద్మశ్రీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి కే.శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.