ఖమ్మం, జనవరి 10: రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద తప్పనిసరిగా స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు 1033కు ఫోన్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వంలోని డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై ఆక్రమణలను తొలగించాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, డీపీవో ఆశాలత, డీఎంహెచ్వో డాక్టర్ కళావతిబాయి, ఆర్టీవో వెంకటరమణ, ఏసీపీ శ్రీనివాసులు, విద్యాశాఖ ఆర్ఎంవో రాజశేఖర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంబాబు, లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రఘురాం ప్రసాద్ పాల్గొన్నారు.