భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట/ ఇల్లెందు/ ఖమ్మం రూరల్/ మధిర/ పెనుబల్లి (కల్లూరు)/ వైరా టౌన్/ సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 16: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. ఈ నెల 11న ఎన్నికలు జరుగగా.. 13న అధికారులు కౌంటింగ్ నిర్వహించి విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఇల్లెందు మినహా సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలను కొలువుదీర్చారు. ఇందులో భాగంగా తొలుత కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్; మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆ తరువాత వారితోపాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రాల్లోనే ఈ ప్రక్రియను నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్‌గా సిరిపురపు లలితకుమారి; అశ్వారావుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జూపల్లి శశికళ, వైస్ చైర్మన్‌గా ఆమె భర్త రమేశ్; ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్; మధిర మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధనికుమార్; కల్లూరు మున్సిపల్ చైర్మన్‌గా ధారావత్ మోహన్‌నాయక్, వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరి; వైరా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్‌గా కట్ల సంతోశ్; సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎండీ రెహానాబేగం, వైస్ చైర్‌పర్సన్‌గా బొంతు సుమలత ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు తొలుత వీరితోనూ, ఆ తరువాత మిగతా సభ్యులతోనూ ప్రమాణం చేయించారు.

కేజీఎంసీలో నల్లబ్యాడ్జీతో కాంగ్రెస్ కార్పొరేటర్ హాజరు..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ) పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ కార్పొరేటర్ ఒకరు నల్లబ్యాడ్జీ ధరించి హాజరై నిరసన తెలిపారు. కేజీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ – సీపీఐ పొత్తు తనకు ఇష్టం లేదని, అయినప్పటికీ పార్టీ పెద్దలు ఈ పొత్తును ఖరారు చేయడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని 26వ డివిజన్ కార్పొరేటర్ దుంపల రాజేశ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తులో ఉన్న సీపీఐ.. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 స్థానాలు వచ్చినప్పటికీ.. మేయర్ పదవిని సీపీఐకే ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అందుకే తాను నల్లబ్యాడ్జీతో నిరసన తెలుపుతున్నానన్నారు. ఈ మేరకు కేజీఎంసీ ఆఫీసు వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. నల్లబ్యాడ్జీ ధరించే ప్రమాణ స్వీకారం చేశారు.

‘ఇల్లెందు ప్రమాణం’ నేటికి వాయిదా..
ఇల్లెందులో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సహా కాంగ్రెస్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారానికి వాయిదా పడింది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ముగ్గురు సభ్యులు మాత్రమే తొలిరోజు సోమవారం ప్రమాణం చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి అయిన కొత్తగూడెం ఆర్డీవో మధు ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, వారితో సహా ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.
కానీ, అధికార పార్టీ నుంచి 19 మంది, స్వతంత్రులుగా గెలిచిన ఇద్దరు గత మూడు రోజులుగా హైదరాబాద్ శిబిరంలో ఉన్నారు. అక్కడ జరిగిన చర్చల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికలు తేలకపోవడంతో.. అధికారులు నిర్ణయించిన సమయమైన సోమవారం ఉదయం 11 గంటలకు వారు స్థానిక మున్సిపల్ కార్యాలయానికి రాలేదు. దీంతో ఎన్నికల అధికారి తొలుత మధ్యాహ్నం 1:30 గంటల్లోగా హాజరుకావాలని సమయమిచ్చారు. అయినప్పటికీ వారు రాకపోవడంతో ఎన్నికల అధికారి మరోసారి స్పందించి మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సమయమిచ్చారు. కాగా, తొలిరోజు ఉదయం 11 గంటలకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. బీఆర్ఎస్ సభ్యుల్లో దండు సారయ్య, పాబోలు స్వాతి, పింగళి అనూహ్య ఉన్నారు.