పాల్వంచ రూరల్, నవంబర్ 26 : ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడల నిర్వహణకు మండలంలోని కిన్నెరసానిలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలకు కిన్నెరసాని గురుకుల స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానం వేదికకానున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3500 మంది క్రీడాకారులు, 500 మంది సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్ ప్రత్యేక శ్రద్ధతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో క్రీడలు జరుగనున్నాయి.
క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. బాలబాలికలకు వేరువేరుగా వసతి కల్పించనున్నారు. బాలికలకు కిన్నెరసాని గురుకులం, బాలురకు పాల్వంచలోని అనుబోస్ కళాశాల, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 4వేల మంది భోజనాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైదానం మధ్యలో క్రీడావేదిక, బారికేడ్ల ఏర్పాటు, రన్నింగ్ ట్రాక్, ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. సోమవారం 28న ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రి, కలెక్టర్లు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరుకానున్నారు.