కూసుమంచి, మే 13: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. నాణ్యమైన ధాన్యం విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. కూసుమంచి మండలం పాలేరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రానున్నందున కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్ కలిసి బుధవారం ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ వివరాల గురించి నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
టోకెన్ విధానాన్ని కచ్చితంగా అమలుచేయాలని సూచించారు. ‘గోనె సంచులు అందుబాటులో ఉన్నాయా?’ అంటూ అని రైతులను అడిగారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యం వివరాలు నమోదు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు రికార్డులు తయారు చేసుకోవాలన్నారు. మద్దతు ధరకు నాణ్యమైన పంటను కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలు వస్తే టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. తూకం విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంబంధిత మిల్లులకు పంపాలన్నారు. రైతులు నిరీక్షించేలా చేయవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల ఇన్చార్జి సునీల్‌రెడ్డి, డీఆర్డీవో శ్రీరాం, పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో జశ్వంత్‌కుమార్ పాల్గొన్నారు.