మామిళ్లగూడెం, డిసెంబర్ 4 : జిల్లాలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 135 డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి సౌకర్యాలతో సిద్ధమయ్యాయని తెలిపారు. వీటిని పంపిణీ చేయడానికి అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, నిరుపేదల ప్రాతిపదికన జాబితా సిద్ధం చేసి శనివారంలోపు అందించాలని ఆదేశించారు.
ఖమ్మం అర్బన్‌లో పూర్తయిన 4 ఇళ్లను ట్రాన్స్జెండర్లకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. అర్హుల జాబితా సిద్ధం కాని ఇళ్లు 470 వరకు ఉన్నాయని, వీటిలో స్వీకరించిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి జాబితాను రెండు వారాల్లో సమర్పించాలన్నారు. నిర్మాణం పూర్తయి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ఇళ్లు జిల్లాలో 635 ఉన్నాయని, వీటిలో కనీస సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. గ్రౌండింగ్ అయిన, పాక్షికంగా నిర్మాణాలు జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్లు 702 వరకు ఉన్నాయని, వీటిని పూర్తి చేయడానికి కూడా వివరాలు సమర్పించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో రాజేశ్వరి, హౌజింగ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.