ఖమ్మం/సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 31 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మం డలం రేజర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కనుమతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతడి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను మంగళవారం వారు కలిసి విజ్ఞప్తి చేశారు. రేజర్ల గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్కు చెం దిన రైతు శ్రీనివాసరెడ్డికి చెందిన సొంత స్థలంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా పోలీసుల సహకారంతో సీసీ రో డ్డు నిర్మాణం చేయడాన్ని తట్టుకోలేక శ్రీనివాసరెడ్డి సోమవారం పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాతా, సండ్ర ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం అతడి భార్యను కూడా అక్రమంగా కస్టడీలో ఉంచిన సత్తుపల్లి సీఐపై కిరణ్‌పై విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.