కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఆగస్టు 29 : తరచూ తమను వేధిస్తున్న పీహెచ్సీ వైద్యుడు, హెచ్ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి, సీఐటీయూ శ్రామిక మహిళా కన్వీనర్ పద్మ మాట్లాడారు. ఆశా వర్కర్లను వేధిస్తే సహించేది లేదని, మోరంపల్లి బంజర పీహెచ్సీలో ఆశా వర్కర్లను వేధిస్తున్న వైద్యుడు, హెచ్ఈవోలపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో పరిమితికి మించి పనులు చేయిస్తున్నారని, వారిని విధుల తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఎంహెచ్వో కార్యాలయ ఏవోకు అందజేశారు.
ధర్నాలో స్పృహతప్పి పడిపోయిన ఆశా వర్కర్
కాగా.. ధర్నా సందర్భంగా సారపాకకు చెందిన శ్రీలత అనే ఆశా వర్కర్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెకు వైద్య సేవలు అందించడంతో కోలుకుంది. కాగా.. ధర్నాపై స్పందించిన వైద్య శాఖ అధికారులు.. వేధింపుల ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బి.రమేశ్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు బుచ్చమ్మ, తారామణి, కృష్ణవేణి, వసంత తదితరులు పాల్గొన్నారు.