పాల్వంచ/ అశ్వారావుపేట/ పెనుబల్లి/ చుంచుపల్లి, అక్టోబర్ 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ, సరహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఎత్తివేసినట్లు ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలపై ఉమ్మడి జిల్లాలో మూడు ప్రధాన చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. లెక్కల్లో చూపని నగదును పాల్వంచలో రూ.25,100, అశ్వారావుపేటలో రూ.23 వేలు, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో రూ.6,660 స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేటలో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో మొదలైన ఆకస్మిక దాడులు.. ఆదివారం ఉదయం 6:30 గంటల వరకూ కొనసాగాయి.
పాల్వంచలో..
పాల్వంచ జాతీయ రహదారిపై నాగారం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టుపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి 12:30 గంటలకు దాడి చేశారు. ఓవర్ లోడ్ వాహనాల నుంచి ఫైన్ వేసినట్లుగానీ, పర్మిట్లు ఇచ్చినట్లుగాగానీ, ట్యాక్స్ కలెక్షన్లు చేసినట్లుగాగానీ ఓచర్లు లేనప్పటికీ కౌంటర్లో రూ.25,100 అన్ అకౌంటెడ్ నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుపై చెక్‌పోస్టులో ఉన్న ఎంవీఐ మనోహర్‌ను ఏసీబీ అధికారులు వివరణ కోరినా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో తనిఖీ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
అశ్వారావుపేటలో..
అశ్వారావుపేటలోని నందమూరినగర్ వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో సుమారు పది మంది ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి 12:30 గంటలకు దాడులు చేశారు. లెక్క చూపని రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టు ప్రాంగణంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్ట్ లావాదేవీలపై ఇన్చార్జి ఆర్టీవో జనార్దన్ నుంచి వివరాలు సేకరించారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.
పెనుబల్లిలో..
పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డుల్లో నమోదు చేయని రూ.6,660 నగదును గుర్తించి సీజ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని ఎందుకు వసూళ్లు చేస్తున్నారని ఎంవీఐ విజయశాంతిని ప్రశ్నించారు. చెక్‌పోస్టులోని రికార్డులను, కంప్యూటర్ డేటా పరిశీలించారు. ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో ఉండగానే లారీ డ్రైవర్లు కొందరు తమ లారీలను చెక్‌పోస్టు వద్ద ఆపి చెక్‌పోస్టు సిబ్బందికి నగదు ఇస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.