సత్తుపల్లి టౌన్, జనవరి 27: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారి నల్లటి వినోద్‌కుమార్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు సోమవారం నేరుగా దొరికిపోయాడు. ఇటీవల ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని గ్రామసభలు నిర్వహించింది. ఈ గ్రామసభల్లో లబ్ధిదారులు తమ పేరు జాబితా లిస్టులో ఉండేలా చూడాలని వార్డు అధికారులను వేడుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు వార్డు అధికారులు మంజూరు లిస్ట్‌లో పేరు ఉండాలంటే తమకు కొంత నగదు ముట్టచెప్పాలని లబ్ధిదారులను లంచం అడుగుతున్నారు.
సత్తుపల్లి పట్టణంలోని 23వ వార్డుకు చెందిన ఓ మహిళ వద్దకు వార్డు అధికారి వినోద్‌కుమార్ వచ్చాడు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు కావాలంటే తనకు రూ.3 వేలు ఇస్తే లిస్టులో పేరు వచ్చేలా చేస్తానని తెలిపాడు. దీంతో ఆ మహిళ ఖమ్మంలోని ఏసీబీ కార్యాలయానికి నేరుగా వెళ్లి సదరు వార్డు అధికారిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు సత్తుపల్లిలో ఈ నెల 25న రెక్కీ నిర్వహించారు. 27న సోమవారం మధ్యాహ్నం పాత సెంటర్లోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్ పక్కన ఉన్న జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చి నగదు ఇవ్వాలని సదరు ఉద్యోగి.. మహిళకు చెప్పడంతో ఆ మహిళ ఏసీబీ అధికారులు కెమికల్ కలిపి ఇచ్చిన రూ.2,500 నగదును వార్డు అధికారికి ఇచ్చింది. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తన సిబ్బందితో సదరు ఉద్యోగిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.
వినోద్‌కుమార్‌ను వరంగల్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే 1064 నెంబర్‌కు కానీ, 9154388981 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఈ నెల 26న ముగిసిపోయి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నది. ప్రత్యేక అధికారి పాలన మొదటిరోజునే ఇలా జరగడంతో అధికారుల పాలనలో జవాబుదారీతనం ఎలా ఉంటుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోపక్క పదవి పూర్తయిన పాలకవర్గం సభ్యులు తమ హయాంలో లంచాలకు తావులేకుండా పాలన కొనసాగిందని, తమ పాలన పూర్తయిన వెంటనే మున్సిపల్ కార్యాలయం లంచగొండితనం బయటపడిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.