ఖమ్మం, మే 6: తాము అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామంటూ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పీసీసీ అధ్యక్షుడు హామీలు గుప్పించారు. పింఛన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పింఛన్దారులు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరించారు. హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇది జరిగి 16 నెలలు పూర్తయింది. కానీ.. హామీ మాత్రం నెరవేరలేదు. ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచలేదు. పైగా గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పింఛన్లనే నేటికీ ఇస్తున్నారు. దీంతో ‘16 నెలలు దాటిపోయింది. పింఛన్ల మొత్తాన్ని ఇంకెప్పుడు పెంచుతారో?’ అనుకుంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు కళ్లలో ఒత్తులేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు.
నాడు అండగా కేసీఆర్..
నిరుపేదలకు సాంఘిక భద్రత కల్పించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014 అక్టోబర్లో ఆరంభించిన ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షలమంది నిరుపేదలకు మేలు చేకూరుతోంది. సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధిత వ్యక్తులకు రోజువారీ కనీస అవసరాలు తీర్చేందుకు, వారి జీవితాన్ని గౌరవ ప్రదంగా గడుపుకునేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ఆసరా పింఛన్లను తెచ్చారు.
తెలంగాణను తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి 2023 నవంబర్ వరకు కేసీఆరే పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆసరా పింఛన్లను కేసీఆర్ ఆపలేదు.
హామీ ఇచ్చి 16 నెలలు..
అప్పటి వరకూ కేసీఆర్ ఇస్తున్న రూ.2,016 పింఛన్లను రూ.4,016గా ఇస్తామని, రూ.4,016 పింఛన్లను రూ.6,016గా ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. 16 నెలలు దాటిపోయినా ఆ పెంచిన పింఛన్లను ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటికే పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు, కొత్తగా చేరే లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు.
17,500 మంది ఎదురుచూపులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం ఖమ్మం జిల్లాలో కొత్తగా 17,500 మంది ఎదురుచూస్తున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలోని 21 మండలాకు చెందిన వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, డయాలసిస్ బాధితులు, వికలాంగులు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 57 ఏళ్ల వయసున్న వారికి ఆసరా పింఛన్లు అందజేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ భర్త మృతిచెందితే ఆ స్థానంలో భార్యకు పింఛన్ ఇస్తున్నారు. కానీ.. చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు చనిపోతే మాత్రం వారి జీవిత భాగస్వాములకు పింఛన్ ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 65 ఏళ్ల వయసు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకురావడం గమనార్హం.