మధిర (చింతకాని), జనవరి 9: గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు స్వాహా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, ఇప్పుడు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చింతకాని మండలం నాగిలిగొండలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంచాయతీ పారిశుధ్య కార్మికుడు పామర్తి శ్రీను భార్య లక్ష్మీ తిరుపతమ్మ పేరుపై ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ, దీనికి సంబంధించిన బిల్లును మరొకరు కాజేశారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, రూ.5 లక్షల బిల్లు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో పామర్తి శ్రీను, అతడి భార్య లక్ష్మీ తిరుపతమ్మ ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారులను యాప్ ద్వారా ఫొటో తీసి అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే శ్రీను భార్య లక్ష్మీ తిరుపతమ్మ పేరుపై ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు, బిల్లులు కూడా చెల్లించినట్లు అధికారుల సర్వేలో తేలింది.
దీంతో శ్రీను.. ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సైని ఆశ్రయించాడు. దీనిపై వారెవరూ స్పందించకపోవడంతో గ్రామంలోని రామాలయం సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం జరిగేంత వరకు దిగేది లేదని భీష్మించాడు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగుల్‌మీరా తన సిబ్బందితో అక్కడికి చేరుకుని శ్రీనును టవర్ దిగి కిందకు రావాలని కోరారు. ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని తహసీల్దార్ అనంతరాజు, ఎస్సై నాగుల్‌మీరా తెలపడంతో శ్రీను కిందకు దిగి వచ్చాడు.