కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం ఓ నిరుపేద గిరిజన మహిళకు శాపంగా మారింది. లబ్ధిదారుల గుర్తింపును, ఎంపిక ప్రక్రియ సమగ్రంగా, పకడ్బందీగా చేపట్టిన కారణంగా ఓ నిరుపేద గిరిజన మహిళ తన గూడును కోల్పోయింది. మళ్లీ కట్టుకోలేని దుస్థితిలోకి వెళ్లింది. దరఖాస్తుల వడపోత సందర్భంలోనే ప్రభుత్వం నిశితంగా పరిశీలించి ఉంటే.. వృద్ధా ప్యం సమీపించిన ఓ వితంతువు ఇప్పుడు తన గూడును కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. బాధితురాలి కథనం ప్రకారం..
లక్ష్మీదేవిపల్లి, మార్చి 11
భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీలోని పాతూరు అనే గిరిజన గ్రామం ఆమెది. ఆమె పేరు తాటి లక్ష్మి. గిరిజన మహిళ. ఎన్నో ఏళ్లుగా అదే గ్రామంలో నివసిస్తోంది. ఐదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసి తన ఇద్దరు పిల్లలకు వివాహాలు జరిపించింది. ఇటుకలతో కూడిన రేకుల ఇంట్లో జీవిస్తోంది. ఈ క్రమంలో ఏడాదిన్న క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించింది. ప్రజాపాలన పేరిట దరఖాస్తులను ఆహ్వానించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారికి తాజాగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోమని, ఇంతకుముందు ఇందిరమ్మ ఇళ్లు పొందని వారికే ఈ దఫాలో మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. అందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. కానీ చివరికి తన మార్గదర్శకాలను తానే పాటించలేకపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఆ గ్రామంలో గ్రామసభ పెట్టింది. ఆ ఊరిని పైలెట్ గ్రామంగా ప్రకటించింది.
ఆ గ్రామంలోని ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు అర్హులను గుర్తించింది. వెంటనే లబ్ధిదారులకు ఆయా పథకాల మంజూరు పత్రాలు పంపిణీ చేసింది. ఇందులో భాగంగా తాటి లక్ష్మిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలిగా గుర్తించి మంజూరు పత్రం అందజేసింది. ఈ మేరకు అధికారులు ఇటీవల ఆమె ఇంటి వద్దకు వెళ్లారు. ‘నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పాత ఇంటిని కూల్చేవేసి మొత్తం చదును చేసి ముగ్గు పోసుకో..’ అంటూ ఆదేశించి వెళ్లారు. సాక్షాత్తూ ప్రభుత్వమే మంజూరు పత్రం ఇవ్వడం, అధికారులు వచ్చి ముగ్గు పోసుకోవాలని ఆదేశించడంతో ఆమె కూడా హుటాహుటిన రూ.15 వేలు వెచ్చించి తన పాత ఇంటిని కూల్చి వేయించింది.
అధికారుల ఆదేశాల మేరకు ముగ్గు కూడా పోయించింది. ఇంతలో మరుసటి రోజు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆమెకు ఫోన్ చేశారు. ‘గతంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం నుంచి నీవు రూ.40 వేలు పొందావు. అందుకని ఇప్పుడు నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు. తాజాగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లు రద్దయింది’ అంటూ స్పష్టం చేశారు. దీంతో లబోదిబోమంటూ ఆమె ఎండలోనే కూలబడింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తనకు ఇంటిని మంజూరు చేసిందని, ఇప్పుడు రద్దుచేశామంటూ చెబుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముందే చెప్పి ఉంటే తాను తన గూడును కూల్చుకునేదాన్ని కాదని తలబాదుకుంది. భర్త కూడా లేని తాను ఇప్పుడు మరో గూడును ఎలా నిర్మించుకోగలనంటూ నెత్తీనోరూ బాదుకుంది. సర్కారు చేసిన తప్పిదానికి తాను నిలువ నీడ కోల్పోయానంటూ కన్నీటిపర్యంతమైంది.