కారేపల్లి, ఏప్రిల్ 21 : ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వైరా నియోజకవర్గం నుండి భారీగా ప్రజలు తరలివచ్చేందుకు పార్టీ స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్రోడ్లో గల మాజీ వార్డు సభ్యుడు సిద్దంశెట్టి నాగయ్య నివాసంలో సోమవారం రాత్రి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఏర్పడి రెండున్నర దశాబ్దాలు పూర్తైన సందర్భంగా 25 సంవత్సరాల గులాబీ పండుగ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సభకు వెళ్లే రోజు ప్రతీ గ్రామంలో గులాబీ జెండాలను ఎగుర వేయాలన్నారు. ఈ సమావేశంలో ఆత్మకమిటీ వైరా నియోజకవర్గ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ సొసైటీ సభ్యుడు ఆడప పుల్లారావు, బీఆర్ఎస్ నాయకులు బానోతు రాందాస్ నాయక్, దాచేపల్లి కృష్ణారెడ్డి, మద్దెబోయిన సత్యనారాయణ, సిద్దంసెట్టి పెద్దనాగయ్య పాల్గొన్నారు.