ఇల్లెందు, మే 9: అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. షరతులు పెడుతూ అన్నదాతలను ఇబ్బందులపాటు చేయొద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇల్లెందు మండలం రేపల్లెవాడ మక్కల కొనుగోలు కేంద్రాన్ని పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి శనివారం దిండిగాల రాజేందర్ సందర్శించారు. అక్కడ అకాల వర్షాలకు తడిసిన మక్కలను, మొలకెత్తిన మొక్కజొన్న గింజలను పరిశీలించారు.
మక్కల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అక్కడే ధర్నా చేశారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సకాలంలో రైతుల పంటలను సకాలంలో సేకరించడంలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి పంటలను తెచ్చిన రైతులు.. వారి పంటలను అమ్ముకునేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవని మండిపడ్డారు. పైగా, కనీసం టార్పాలిన్లు కూడా లేకపోవడం వల్లనే రైతుల పంటలు అకాల వర్షాలకు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆరుగాలపు కష్టం అకాల వర్షం పాలైనా కాంగ్రెస్ పాలకులు పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి బాధలు లేవని గుర్తుచేశారు. గిట్టుబాటు ధరలు కల్పించేవారని, ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేవారని, తడిసి రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనేవారని వివరించారు. రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అజ్మీరా భావ్‌సింగ్, అబ్దుల్ జబ్బార్, అబ్దుల్ నబీ, ప్రమోద్, డేరంగుల పోషం, ఘాజీ, మూడ్ కృష్ణప్రసాద్, సత్యనారాయణ, నారపాక వసంతరావు, యేపె శంకర్, ఎట్టి రమణ, ఉద్యమకారులు ఆదేరి రవి, రాంలాల్ పాసి, రాపల్లి శ్రీను, సుందరి శ్రీను, వాసు, సునీల్, మూలగండ్ల ఉపేందర్‌రావు, లలిత్ కుమార్ పాసీ, శ్రీకాంత్, హరిప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.