కారేపల్లి, ఆగస్టు 12 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాల అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2013లో రెండు మోడల్ పాఠశాలలను నిర్మించగా అందులో కారేపల్లి మోడల్ స్కూల్ ఒకటి. నాటినుండి ఈ పాఠశాల 10వ తరగతిలో రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు క్రీడల్లోనూ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో పాఠశాల, వసతి గృహం భవన నిర్మాణాలను చేపట్టారు. కానీ పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలోకి గేదెలు, పందులు, ఇతర మూగజీవాలు వచ్చి చేరుతున్నాయి.
దాంతో పాటు రాత్రి వేళల్లో అకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాల ప్రాంగణం అడ్డాగా మారుతుంది. భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులకు రక్షణ కరువైంది. పాఠశాల కళాశాలగా కూడా అప్గ్రేడ్ అయింది. మధ్యాహ్నం భోజన విరామం, సాయంత్రం వేళల్లో కొంతమంది యువత బైకుల మీద వచ్చి చెక్కర్లు కొడుకు విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కారేపల్లి మోడల్ పాఠశాల, కళాశాల, వసతి గృహం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు విద్యాశాఖను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.