మధిర, నవంబర్ 08 : అధికారుల కన్నుగప్పి అక్రమార్కులు యధేచ్చగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధిర మండలం నక్కల గరుబు (బుచ్చిరెడ్డిపాలెం) గ్రామ సమీపంలో గల వైరా నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా దారులు అక్రమంగా తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని పగటిపూట తరలించాల్సి ఉంది. కానీ ఇసుక అక్రమ రవాణా దారులు ఏకంగా రాత్రి వేళల్లో కూడా వైరా నదికి చేరుకుని ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వాస్తవంగా మధిర తాసీల్దార్ ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే కూపన్స్ పంపిణీ చేస్తున్నారు. కానీ ఏ ఇతర పనులకు ఇసుక తరలించే పర్మిషన్ నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
కానీ ఇసుక అక్రమ రవాణాదారులు మాత్రం వారి ఆదేశాలను బేఖాతార్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 ట్రాక్టర్లు ఇసుకను తరలించేందుకు మున్నేరు వద్దకు చేరుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇసుక ర్యాంప్ వద్దకు స్థానిక రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి తన సిబ్బందితో చేరుకున్నారు. ఇసుక అక్రమ రవాణాదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళలో ఇసుక రవాణా చేయడానికి అనుమతి లేని ట్రాక్టర్లను ఎస్ఐ స్వాధీనంలోకి తీసుకుని తాసీల్దార్ కార్యాలయానికి తరలించారు.