బూర్గంపహాడ్ (భద్రాచలం), ఆగస్టు 15 : దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగకుండా.. అహర్నిశలు కృషి చేసి అసువులు బాసిన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని, ఆ స్వేచ్ఛా ఫలాలను మనం అనుభవిస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గురువారం 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో యూనిట్ అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన పీవో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భారత సమాజం కోసం, స్వేచ్ఛ కోసం తిరుగుబాటు చేసిన త్యాగధనులు అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీం వంటి వారు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నారన్నారు.
కాగా.. వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బందికి పీవో ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌రాజు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, తానాజీ, దావూద్, ఎస్వో ఏడీ భాస్కర్, హెచ్‌ఎన్‌టీసీ ఉదయ్‌కుమార్, డీటీఆర్వోఎఫ్ఆర్ శ్రీనివాస్, ఏసీఎంవో రమణయ్య, ఏపీవో పవర్ మునీర్‌పాషా, ఏటీడీవో అశోక్, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.