కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 12: తెలతెలవారుతుండగానే తుపాకుల గుండ్ల మోత.. నలుదిక్కులా సాయుధ దళాల దండయాత్ర.. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి.. ఒళ్లు గగుర్పొడిచే భయానక వాతావరణం.. పచ్చటి చెట్లపై మంచు తుంపరలకు బదులుగా ఎర్రటి రక్తపు మరకలు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణ్‌పూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దు దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో నారాయణ్‌పూర్ జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) బలగాలతోపాటు దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడి భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. మసక చీకట్లో ఇరువర్గాలు సుమారు రెండు గంటలపాటు హోరాహోరీ తలపడ్డాయి. నలుదిక్కుల నుంచి వస్తున్న భద్రతా దళాల తూటాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటనా స్థలంలో ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణ్‌పూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్‌కుమార్ తెలిపారు.
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మృతదేహాలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నామని, మృతులు ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్పీ చెప్పారు. అయితే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు వరుస విధ్వంసాలు సృష్టిస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ వారికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఈ ఏడాది బస్తర్ రేంజ్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 217 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో కీలక నేతలు కూడా ఉండడంతో ఆ పార్టీకి ఈ ఏడాది కొంత చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. 2025 నాటికి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని సమూలంగా పెకిలించేందుకు దూకుడు పెంచాయనడానికి ఈ ఏడాది జరుగుతున్న ఎన్కౌంటర్లే నిదర్శనమని తెలుస్తోంది. దక్షిణ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నాలుగు జిల్లాలకు చెందిన భద్రతా దళాలు ఒక్కసారిగా చుట్టుముట్టడం గమనార్హం. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు మున్ముందు ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తారోనని మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతవాసులు హడలిపోతున్నారు.