టేకులపల్లి, మే 24 : వాహన తనిఖీల్లో భాగంగా 698 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్ తెలిపారు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సమీపంలో సీసీఎస్, సివిల్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ను తనిఖీ చేయగా.. 698 కిలోల నిషేధిత గంజాయి లభ్యమైంది. దీని విలువ సుమారు రూ.3.49 కోట్లు ఉంటుందని సీఐ తెలిపారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా.. ఏపీ రాష్ట్రం అల్లూరి జిల్లా వై.రామవరం మండలం బచ్చలూరు నుంచి సీలేరు మీదుగా హర్యాన రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్‌కుమార్ ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున గంజాయిని హర్యానకు రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
నిందితులు సందీప్‌కుమార్, లక్వీందర్, అమర్నాథ్ కుమార్, పవన్‌కుమార్, రాజ్‌కుమార్, కృష్ణకుమార్.. అమ్మిన వ్యక్తి హరికరన్ వద్ద నుంచి ప్రిన్స్కుమార్కు అందజేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. గంజాయిని అమ్మిన, కొనుగోలు చేసిన, రవాణా చేసిన వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి, ఐచర్ వ్యాను, కారు, ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. కాగా.. గంజాయి తరలిస్తున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సురేశ్, ఎస్సై రాజేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవణ్, రామారావులను ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
పట్టుబడిన గంజాయి దహనం
ఖమ్మం, మే 24 : వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ నేతృత్వంలో శనివారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 90.70 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ(అడ్మిన్) నరేష్కుమార్, టాస్‌ఫోర్స్ ఏసీపీ రవి పర్యవేక్షణలో తల్లాడ మండలం గోపాల్పేట గ్రామం లో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ బయో వేస్టేజ్ బర్నింగ్ ప్లాంట్‌లో దహనం చేశారు.
ఖమ్మం వన్‌టౌన్, త్రీటౌన్, ఖమ్మంరూరల్, ఖానాపురంహవేలి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, వీఎం బంజర, ఏనూరు పోలీస్స్టేషన్లకు సంబంధించిన 17 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో సీసీఆర్బీ సీఐ స్వామి, తల్లాడ ఎస్సై కొండల్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.