ఖమ్మం, ఫిబ్రవరి 27 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. హైదరాబాద్‌కు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్‌కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నుంచి ప్రతిపక్ష నేతలు గులాబీ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్.. ఇతర పార్టీ నాయకుల చేరికలతో మరింత బలోపేతమైంది. ప్రస్తుతం నగర కార్పొరేషన్‌తో పాటు రఘునాథపాలెం మండలంలో టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి అవకాశం లేని పరిస్థితి నెలకొన్నది. నగరంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతుండడంతో గులాబీ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. రహదారుల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పనితీరు, మాట ఇస్తే వెనక్కు తగ్గని విధానంతో ఇటీవల కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. మున్ముందు మరికొందరు చేరతారనే ప్రచారం నగరంలో జరుగుతున్నది. తాజాగా నగరంలోని 57వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది.
టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో 57వ డివిజన్ కాంగ్రెస్ నేత కొరివి దయానంద్ నాయకత్వంలో 600 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి అజయ్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రమణగుట్టను రమణహిల్స్గా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు ఉండేది కాదన్నారు. ప్రజలు భయం భయంగా బతికేవారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఒకనాడు ఈ ప్రాంతంలోని భూములకు విలువ లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూముల ధర రెట్టింపు అయిందన్నారు. నగరాభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నగరంలోని ప్రతి గల్లీకి సైడు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించడంతో నగర స్వరూపం మారిందన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. 57వ డివిజన్ పరిధిలోని వికలాంగులకాలనీ, రమణగుట్ట తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తున్న ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఈ డివిజన్ అభివృద్ధికే రూ.11 కోట్లు ఖర్చు చేశామన్నారు. నగరంలోని మరికొన్ని డివిజన్లలో రూ.25 కోట్లు వెచ్చించామన్నారు. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, దండా అయ్యప్ప జ్యోతిరెడ్డి, టీఆర్ఎస్ డీవిజన్ అధ్యక్షుడు తమ్మి శెట్టి పరశురాం, టీఆర్ఎస్ మైనార్టీ విభాగ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు ఇస్సాక్, షకీనా, జక్కుల లక్ష్మయ్య పాల్గొన్నారు.