ఖమ్మం, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత నెల 28 నుంచి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలన కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. గ్రామాలు, వార్డుల నుంచి 5,49,852 దరఖాస్తులు అందాయి. దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ నమోదుకు ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అత్యధిక దరఖాస్తులు రూ.500కు గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 పంపిణీకి వచ్చాయని తెలుస్తోంది. ప్రజాపాలన సభల వద్ద ప్రత్యేక బృందాలు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. వారి సందేహాలను హెల్ప్ డెస్క్‌లు నివృత్తి చేశాయి.
పర్యవేక్షణ ఇలా..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో చేపట్టిన ప్రజాపాలన సభల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు నియమితులయ్యారు. ఆయన తొలిరోజు నుంచే గ్రామాలు, పట్టణస్థాయిలో గ్రామసభలను పరిశీలించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ప్రజాపాలన గ్రామసభలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హాజరయ్యారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగిన సభలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. రఘునాథపాలెం మండలంతో పాటు ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో జరిగిన ప్రజాపాలన సభలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేశారు.
తొలుత గందరగోళం..
ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజలు తొలి రెండు, మూడు రోజుల్లో గందరగోళానికి గురయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ పొందే వారు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే అంశంపై దరఖాస్తుదారుల్లో అయోమయం కనిపించింది. అలాగే మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల దరఖాస్తుల్లోనూ దరఖాస్తుదారులకు అనేక సందేహాలు తలెత్తాయి. తెల్లరేషన్ కార్డు లేని వారు తొలుత దరఖాస్తు చేసుకోవడానికి సందేహించారు. దరఖాస్తు ఫారంలో తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పత్రం జత చేయాలని అధికారులు చెప్పడంతో కార్డు లేని వారు నిరాశకు గురయ్యారు. తర్వాత రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో తిరిగి దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించారు.
భద్రాద్రి జిల్లా దరఖాస్తులు 3,33,370
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం సాయంత్రంతో ముగిసింది. గత నెల 28న కార్యక్రమం ప్రారంభం కాగా.. జిల్లావ్యాప్తంగా 481 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి గ్రామసభలు చేపట్టారు. ప్రతి రోజూ మూడు బృందాలు.. పది కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే దరఖాస్తుదారులు ఆధార్ అప్డేట్, గ్యాస్ ఈ-కేవైసీ నమోదు విషయంలో గందరగోళంలో పడ్డారు. వారి సమస్యలను నివృత్తి చేసేందుకు అధికారులు సైతం తికమకపడ్డారు. కాగా.. 481 గ్రామ పంచాయతీలు..104 మున్సిపల్ వార్డుల్లో 3,33,370 దరఖాస్తులు వచ్చాయి.
ఆన్లైన్ ప్రక్రియలో నిమగ్నం
ఆరు గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో ఆన్లైన్ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ప్రియాంక ఆల వీసీ ద్వారా ప్రత్యేకాధికారులకు దరఖాస్తుల ఆన్లైన్ విధానంపై దిశానిర్దేశం చేశారు. అంతకుముందే ఆన్లైన్ చేసే ఆపరేటర్లకు శిక్షణ సైతం ఇచ్చారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఆయా మండల కార్యాలయాల్లో ప్రత్యేక కంప్యూటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నాటికి ఆన్లైన్ పూర్తి చేయాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.