మధిర, జనవరి 17 : ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి భారీ సంఖ్యలో జనసమీకరణ చేసేందుకు ఇన్చార్జిలు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మండలాల వారీగా, గ్రామస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు.
నియోజకవర్గం నుంచి 51,500 జనాభాను తరలించేందుకు ఆటోలు, డీసీఎంలు, టాటాఏసీలు, బస్సులు, లారీలు, బోలెరోలు మొత్తం 2,536 వాహనాలను నియోజకవర్గ నాయకులకు అప్పగించారు. మంగళవారం బోనకల్లు, మధిర మండలాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు వ్యవసాయ కూలీలను కలిసి సభకు రావాలని కోరారు. ఎర్రుపాలెం మండలంలో వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు.