Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే తల్లాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్గం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులను జఫర్‌గఢ్‌కు చెందిన చిల్లర బాలకృష్ణ (కారు డ్రైవర్), రాయల అనిల్‌గా గుర్తించారు.
క్షతగాత్రులను అజయ్, కొల్లిపాక కాంతి, గట్టు రాకేశ్‌గా నిర్ధారించారు. వీరిది స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఉప్పుగల్లు అని పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దట్టమైన పొగమంచు కారణంగా సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.